
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ చుక్కలు చూపుతున్నది. తాజాగా గురుకుల పిడి పోస్టులకు జరిపిన మెయిన్స్ ను రద్దు చేస్తూ టిఎస్పిఎస్సీ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఈ పరీక్షలను నిర్వహిస్తామని కమిషన్ తాజాగా ప్రకటించింది.
జులై 18వ తేదీన గురుకుల పిడి పోస్టుకు టిఎస్పిఎస్సీ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అయితే ఆ పరీక్షలో లోపాలున్నట్లు ఆలస్యంగా గుర్తించింది టిఎస్పిఎస్సీ. ఒక సిరీస్ పశ్నాపత్రంలో ఒక పేజీ లేకుండానే పరీక్షలు జరిపినట్లు గుర్తించింది టిఎస్పిఎస్సీ. అందుకే పరీక్షను రద్దు చేసి సెప్టెంబరు 7వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని వెల్లడించింది.
అయితే పరీక్ష రాసి రిలాక్స్ గా ఉన్న అభ్యర్థులకు పిడుగులాంటి వార్త ప్రకటించడంతో మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన తరుణం ఆసన్నమైందని నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. గురుకులాల పోస్టుల నోటిఫికేషన్ నాటి నుంచి మెయిన్స్ పరీక్షలు జరిపే వరకు అనేకరకాలుగా నిరుద్యోగులతో టిఎస్పిఎస్సీ చెలగాటమాడిందని, ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగుతోందని నిరుద్యోగ జెఎసి మండిపడింది.