కేసులు మేనేజ్ చేస్తానంటూ వసూళ్లు.. జీఎస్టీ అడిషనల్ కమీషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు

By Siva KodatiFirst Published Dec 6, 2022, 9:34 PM IST
Highlights

ఇప్పటికే వరుస వివాదాల్లో వున్న జీఎస్టీ అడిషనల్ కమీషనర్ బొల్లినేని గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. జీఎస్టీ కేసులు మేనేజ్ చేస్తానంటూ పలువురి వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లుగా అభియోగాలు రావడంతో ఆయనను సీబీడీటీ సస్పెండ్ చేసింది. 
 

జీఎస్టీ అడిషనల్ కమీషనర్ బొల్లినేని గాంధీపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సస్పెన్షన్ వేటు వేసింది. జీఎస్టీలో కేసులో మేనేజ్ చేస్తానంటూ పలువురి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన అభియోగాలపై సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది. 180 రోజుల పాటు గాంధీని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. గతంలోనూ ఇదే ఆరోపణలపై బొల్లినేని గాంధీ సస్పెండ్ అయ్యారు. అలాగే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు కూడా వున్నాయి. 

ALso REad:బొల్లినేని శ్రీనివాస్ గాంధీకీ ఈడీ ఉచ్చు.. వెనక జగన్ హస్తం?

కాగా... గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసిన గాంధీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాప్తు చేశారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై కూడా దర్యాప్తు చేశారు. 

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు: 

బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా చేరాడు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్‌ కమిషనరేట్-1లో పోస్టింగ్ పొందారు.

2003లో డిప్యుటేషన్‌ పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కి వెళ్లారు. అక్కడి నుంచి 2004లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి వెళ్లి 2017 వరకు విధులు నిర్వహించారు. అనంతరం జీఎస్టీకి బదిలీ అయ్యారు.

అయితే ఆ బదిలీ సైతం నిబంధనలకు అనుగుణంగా జరగలేదని సమాచారం. అప్పట్లో అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ అధికారి ప్రోద్బలంతో బీఎస్ గాంధీని నియమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

2010-19 మధ్య కాలంలో బొల్లినేని గాంధీ తన పేరు మీద తన కుటుంబసభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు.

2010 జనవరి 1 నాటికి ముందు గాంధీ స్థిర, చరాస్తుల విలువ రూ. 21,00,845గా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. జూన్ 27, 2019 నాటికి గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ సుమారు రూ. 2,74,14,263కు చేరుకున్నట్లు తేల్చారు.

అలాగే 2010-19 మధ్య కాలంలో గాంధీ, ఆయన కుటుంబసభ్యుల ఆదాయాన్ని రూ. 1,30,07,800లుగా నిర్ధారించారు. దీంతో శ్రీనవాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను నిందితులుగా చేర్చారు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ ఉద్దేశ్యపూర్వకంగా తన ఆస్తులను పెంచుకునేందుకు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డట్లుగా అభియోగం నమోదు చేశారు.

దీని ప్రకారం ఐపీసీ సెక్షన్ 109 ఫ్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని 13 (2), 13(1)(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ (ఏసీబీ) వి.వివేకానందస్వామికి అప్పగిస్తూ సీబీఐ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

click me!