
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు 61.37 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 2,33,248 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. నిరుడు జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది అంటే 79.15 శాతం మంది హాజరు అయ్యారు. కాగా, పేపర్ లీకేజీ తర్వాత రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 53000 మంది దూరంగా ఉండడం గమనార్హం.
గతంలో జరిగి, రద్దయిన ప్రిలిమినరీ పరీక్షతో పోలిస్తే ఈసారి.. పరీక్షలో ప్రశ్నలు కాస్త సులభంగానే వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు మాత్రం..ప్రశ్నలు చదివి అర్థం చేసుకుని.. సమాధానాలను గుర్తించేందుకు.. ఒక్కో ప్రశ్నకు సగటున రెండు నిమిషాల చొప్పున పట్టిందని చెప్పారు. ఈసారి ప్రశ్నాపత్రంలో..లోతైన అనలిటికల్ ప్రశ్నలు తగ్గాయి. ప్రశ్నలు ఎక్కువ శాతం రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ ప్రభుత్వ విధానాల నుంచి ఎక్కువగా వచ్చాయని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి నుంచి ప్రశ్నలు పెద్దగా రాలేదన్నారు. వచ్చిన ప్రశ్నల గురించి చెబుతూ.. హైదరాబాదులో జురాస్టియన్ ఇరానీ వలసదారులు 19వ శతాబ్దం ప్రారంభంలో ఏ వంటకాన్ని పరిచయం చేశారు? భారతదేశ మిసైల్ మ్యాన్ ఎవరు? లాంటి ప్రశ్నలు వచ్చాయి. వీటితోపాటు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని రంగాల డేటా మీద కూడా ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. జనరల్ కేటగిరీకి ఈసారి కట్ ఆఫ్ మార్కులు 75- 80 ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1 పరీక్ష.. అరగంట ముందుగానే పేపర్లు లాక్కొన్న ఇన్విజిలేటర్, అభ్యర్ధుల ఆందోళన
ఇటీవల పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు తనిఖీలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే ఇదే క్రమంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యా అభ్యర్థులకు కూడా రెండంచెల పద్ధతిలో తనిఖీలు నిర్వహించారు. కారు తాళాలను కూడా లోపలికి అనుమతించలేదు. కొన్ని కేంద్రాల్లో అయితే బెల్టులు కూడా తీసేయించారు. అయితే, గతంలో చేసినట్టుగా బయోమెట్రిక్ విధానాన్ని..ఆ నమోదును చేయలేదని అభ్యర్థులు తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షా సమయానికి అరగంట ముందుగానే ఓఎంఆర్ షీట్లు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని జిల్లా కలెక్టర్ హరీష్ ఖండించారు.
ఇక నిజామాబాదులోని కాకతీయ మహిళా కళాశాలలో ఏర్పాటైన కేంద్రంలోని ఓ గదిలో ప్రశ్న పత్రాలు తక్కువ పడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన అధికారులు బఫర్ నుంచి తీసుకువచ్చి అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పరీక్ష 14 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. వారికి 14 నిమిషాల సమయాన్ని ఇచ్చారు. ఇక సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో బి ప్రశాంత్ అనే అభ్యర్థి పరీక్షకు హాజరయ్యాడు.
కాసేపటికి.. ప్రశ్నాపత్రం ఇవ్వకముందే ఓఎంఆర్ షీట్ ఇచ్చి వెనక్కి వచ్చేసాడు. ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నెంబర్ తప్పుగా వేశాడు. పొరపాటును గమనించి.. పరీక్ష రాసినా.. మార్కులు రావని భావించి.. ఇలా చేసినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కేంద్రంలోనే ఉండాలనే నిబంధనను అతడు విస్మరించాడు. అది గమనించిన పోలీస్ సిబ్బంది ఆ విద్యార్థిని అరెస్టు చేసి మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష మీద సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలలత మాట్లాడుతూ.. గతంలో రద్దయిన ప్రిలిమ్స్ పేపర్ కన్నా ఈ ప్రశ్న పత్రం కొంత బాగానే ఉందన్నారు. కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు పాతవే వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల మీద నేరుగా జవాబు చెప్పే ప్రశ్నలు అడిగారని.. రద్దయిన పరీక్షతో పోలిస్తే కటాఫ్ మార్కులు పెద్దగా పెరగకపోవచ్చు అన్నారు.
బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ… గత ప్రిలిమినరీతో పోలిస్తే ఈసారి ప్రశ్నలు సూటిగా, క్రిస్పీగా ఉన్నాయన్నారు. అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు కొంత కఠినంగా ఉన్నాయన్నారు.