బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి బస్సులో మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. దాని కంటే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుల విషయంలో అధికార పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బీఆర్ఎస్ సందర్శిస్తోందని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మేడిగడ్డకు బయలుదేరే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత యాసంగి పంట సీజన్ లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ యాత్ర చేస్తున్నామని అన్నారు. మేడిగడ్డ వద్ద దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మేడిగడ్డకు మరమ్మతు పనులు చేపట్టి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి మేడిగడ్డ అంశాన్ని రాజకీయం చేయడం ప్రభుత్వానికి తగదని తెలిపారు. రాజకీయ లబ్ది పొందేందుకు మేడిగడ్డ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాగా.. అంతకు ముందు ఇదే విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'చలో మేడిగడ్డ' ఎందుకో చేపట్టాల్సి వస్తుందో ఆయన అందులో వివరించారు.
మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే... ఈ “చలో మేడిగడ్డ”
చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే... ఈ “చలో మేడిగడ్డ”..
ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే..
ఈ “చలో మేడిగడ్డ”
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు ఈ “ చలో మేడిగడ్డ ”
పంజాబ్ నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ “చలో మేడిగడ్డ”
మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే.. అని మరోసారి చాటిచెప్పేందుకే ఈ “చలో మేడిగడ్డ”
దశాబ్దాలపాటు.. కాంగ్రెస్ చేసిన తప్పులను.. కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను.. అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకే.. ఈ “చలో మేడిగడ్డ”
మళ్లీ కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం..మీ దుష్ట రాజకీయాల కోసం.. మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించం..
పోటీ యాత్రలు చేయడం కాదు.. ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి..
మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే... తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్ కే నూకలు చెల్లడం ఖాయం
వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యం
జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై బీఆర్ఎస్... అని కేటీఆర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు..