ఓయూలో నైట్ వాచ్ మెన్ కు 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. స్ట్రీట్ లైట్ల కింద చదివి విజయం..

By Sairam IndurFirst Published Mar 1, 2024, 10:36 AM IST
Highlights

జీవితంలో ఏదైనా సాధించాలంటే అన్ని రకాల సౌకర్యాలే ఉండాల్సిన పని లేదని నిరూపించారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఓ వైపు నైట్ వాచ్ మెన్ గా పని చేస్తూ, మరో వైపు స్ట్రీట్ లైట్ల కింద చదివిన ఆయన.. ఒకే సారి మూడు ఉద్యోగాలు సాధించారు.

ఆయన ఓ నైట్ వాచ్ మెన్. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది కల. కానీ దానికి సమయం పడుతుందని తెలుసు. అంత వరకు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించారు. అందుకే నైట్ వాచ్ మెన్ గా జాయిన్ అయ్యారు. రాత్రి సమయంలో స్ట్రీట్ లైట్ల కింద చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. చివరికి తన కల సాకారం చేసుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే సారి ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఎన్నో కష్టాలు ఎదురైన పట్టు వదలకుండా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చివరికి అనుకున్నది సాధించిన 31 ఏళ్ల గొల్లె ప్రవీణ్ కుమార్ విజయ గాథ ఇది. అపజయాలు ఎదురవుతున్నా.. సంకల్ప దీక్షతో తన అసాధారణ కథను లిఖించుకున్న ఆయన ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గమనార్హం. ఆయన నేటి యువతకు మార్గదర్శకం. 

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్ సీ)లో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న గొల్ల ప్రవీణ్ స్వస్థలం మంచిర్యాల. తండ్రి మేస్త్రీ, తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ‘తెలంగాణ టుడే’ కథనం పేర్కొంది.

ఓయూ క్యాంపస్ లో ఎంకాం, బీఈడీ, ఎంఎడ్ డిగ్రీలు చదివారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని అనుకున్నారు. కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని ఆలోచించి.. ఇక వారికి భారం కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈఎంఆర్ సీలో నైట్ వాచ్ మెన్ గా జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి స్ట్రీట్ లైట్ల కింద చదువుకుంటూ గ్రూప్ -2తో పాటు పలు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. కానీ పరాజయం ఎదురైంది. డీఎస్సీ-2018 నోటిఫికేషన్ లో సగం మార్కుల తేడాతో ఉద్యోగానికి ఎంపిక కాలేదు. అయినా నిరాశ చెందకుండా తన ప్రిపరేషన్ కొనసాగించారు. 

ఎలాంటి కోచింగ్ లేకుండా, యూట్యూబ్ కంటెంట్ మీద ఆధారపడి సొంతంగా ప్రిపేర్ అయ్యారు. పట్టువదలకుండా ప్రవీణ్ కుమార్ చేసిన కృషికి విజయం కూడా దాసోహం అయ్యింది. ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో ఆయనను ఒకే సారి మూడు ఉద్యోగాలు వరించాయి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీలో కామర్స్ లో జూనియర్ లెక్చరర్ (జేఎల్ ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సోషల్ స్టడీస్ ) పోస్టులకు ఎంపికయ్యారు. 

ఈ విషయం తెలియడంతో ఈఎంఆర్ సీ డైరెక్టర్ పి.రఘుపతి, ఇతర సిబ్బందితో కలిసి ప్రవీణ్ ను అభినందించారు. ఘనంగా సన్మానించారు. మూడు ఉద్యోగాల్లో ఆయన జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరనున్నారని ‘తెలంగాణ టుడే’తో తెలిపారు. చిన్న చిన్న పరాజయాలకే నిరుత్సాహానికి లోనవుతున్న ప్రస్తుత యువతకు ప్రవీణ్ కుమార్ ఆదర్శపాయంగా నిలిచారు. ప్రవీణ్ కుమార్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. 

click me!