గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. హైకోర్టులో ఇందుకు సంబంధించి పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎన్నికలకు ముందు నుంచీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ క్యాబినెట్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను సిఫారసు చేసింది. వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిందని సూచించింది. కానీ, గవర్నర్ తమిళిసై ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి వారిద్దరికీ తగిన అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.
దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల విచారణ అర్హతపై హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది.
undefined
ఇదిలా ఉండగా.. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఆ రెండు ఎమ్మెల్సీలపై కన్నేసింది. ఈ ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను రేవంత్ రెడ్డి క్యాబినెట్ ప్రతిపాదించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో అద్దంకి దయాకర్‌కు చాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ రిజర్వ్ చేసిందనే చర్చ జరుగుతున్నది. ఆయనతోపాటు ఓ మైనార్టీ నేతనూ ఇందుకోసం ఎంపిక చేయనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తున్నది. ఇదిలా ఉండగా, గవర్నర్ తమిళిసై మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
హైకోర్టులో ఇందుకు సంబంధించి రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో అసలు ఈ ఖాళీల భర్తీపై ఇప్పుడే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపైనా చర్యలు తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.