
హైదరాబాద్: పదవ తరగతి మంచి మార్కులతో పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని గవర్నర్ నరసింహన్ అధికారులను ప్రశ్నించారు. సున్నా మార్కులు రావడమేమిటని అడిగారు. ఇంటర్ ఫలితాలపై ఇంత పెద్ద యెత్తున వివాదం ఎందుకు చెలరేగిందని ఆయన ఆరా తీశారు. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటని గవర్నర్ అడిగారు. తాజా పరిస్థితిపై తనకు వివరాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకొని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, ఇంటర్ బోర్డు విశ్వసనీయత పెంచేలా చర్యలు ఉండాలని గవర్నర్ ఆదేశించారు. 3.2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరి జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వారు గవర్నర్ కు వివరించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.