
తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇవాళ రాజ్ భవన్ క్యూ కట్టారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ వద్దకు వెళ్లారు. 70పుష్పగుచ్ఛాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏపీ సీంఎం చంద్రబాబు కూడా స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కూడా తినిపించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇలా గవర్నర్ వద్దకు భారీ నేతాగణంతో ఇరు రాష్ట్రాల సీఎంలు స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలపడం వెనక ఎవరి అవసరాలు వారికి ఉన్నాయన్నది బహిరంగం రహస్యం.
ముఖ్యంగా విభజన సమస్యల నేపథ్యంలో ఇటీవల గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. విభజన చట్టంలో 7,8 సెక్షన్లు అమలులో గవర్నర్ పాత్రే అత్యంత కీలకం. మరోవైపు గడువు తీరకముందే సచివాలయంలోని ఏపీ భవనాలను స్వాధీనం చేసుకోని, వాటిని కూలగొట్టి అక్కడే కొత్తగా సచివాలయం నిర్మించాలని కేసీఆర్ ప్లాన్. ఈ నేపథ్యంలో భవనాల అప్పగింతపై తెలంగాణ సీఎం కేసీఆర్ ... ఏపీ ప్రభుత్వాన్ని డైరెక్టుగా అప్రోచ్ కాకుండా గవర్నర్ తోనే ఈ పనులు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకే గవర్నర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మధ్య రెండు రోజులకు ఒకసారైనా కేసీఆర్.. రాజ్ భవన్ కు క్యూ కడుతున్నారు.
మరోవైపు తెలంగాణతో వివిధ సమస్యలపై పరిష్కరించుకోడానికి ఏపీ ప్రభుత్వం కూడా గవర్నర్ ద్వారానే ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాల అప్పగింతపై తన అభిప్రాయాలను గవవర్నర్ ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ లో 10 సంవత్సరాల వరకు ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన భవనాలను వినియోగించుకొనే హక్కు ఉంది. అయితే వెలగపూడి నుంచే మొత్తం పాలన చేపడుతున్న నేపథ్యంలో భవనాల అప్పగింతపై ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని షరతులతో తెలంగాణ ప్రభుత్వానికి వాటిని అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భవనాల అప్పగింతపై తన డిమాండ్లు తదితర అంశాలను ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి డైరెక్టుగా చెప్పకుండా గవర్నర్ చెవిన పడేస్తుంది.
ఇలా గత కొన్నేళ్ల నుంచి రెండు రాష్ట్రాల విన్నపాలు, కోపతాపాలు సహనంతో విని వాటిని పరిష్కరించడంలో గవర్నర్ నరసింహన్ తలమునకలైపోతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న బాధ్యతలను నెరవేర్చడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజ్ భవన్ హైదరాబాద్ లోనే ఉండడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా ఇక్కడికి వచ్చి తమ విన్నపాలను గవర్నర్ కు తెలుపుతున్నారు. కానీ, వెలగపూడి నుంచి పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీన్ని అర్థం చేసుకున్న గవర్నర్ ఆయనే స్వయంగా వీలు చూసుకొని తరచుగా విజయవాడ వెళ్లి ఏపీ సీఎంను కలసి నవ్యాంధ్ర రాష్ట్ర సమస్యలను చర్చిస్తున్నారు.
గత ఏడేండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ కాలంలోనే తెలుగు ప్రాంతాలు
ధర్నాలు, ఆందోళనలు, ఆత్మహత్యలు, ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడుకి పోయాయి. ఇప్పడు
విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది అపుడపుడు ఉద్రిక్తతకు కూడా దారి తీసింది. రెండురాష్ట్రాల నాయకుల తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగిన సందర్భాలున్నాయి. ఇపుడు రెండు ప్రభుత్వాలు ఈ మార్గం వదలి మర్యాదగా, రాజ్యంగ బద్ధంగా నడచుకోవాలనుకుంటున్నాయి. దీనికి రాజ్ భవన్ వేదిక అవుతున్నది. ఈ కొత్త ప్రాముఖ్యం ఈ రోజు గవర్నర్ 70 వ జన్మదినం నాడు ప్రత్యక్షమయింది.