జింఖానా గ్రౌండ్స్ ఘటనపై ఇద్దరితో కమిటీ, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం:మంత్రి శ్రీనివాస్ గౌడ్

By narsimha lodeFirst Published Sep 22, 2022, 5:05 PM IST
Highlights

జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు . హెచ్ సీ ఏ కి పూర్తి స్థాయి కార్యవర్గం లేనందున కొన్ని సమస్యలు వచ్చాయని మంత్రి వివరించారు. 

హైదరాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటపై ఇద్దరితో కమిటీని ఏర్పాటు చేశామని  తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.  ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు. 

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నిర్వహణ విషయమై హెచ్ సీ ఏ తో పాటు పలువురు శాఖల అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. 

 రాచకొండ సీపీ మహేష్ భగవత్,   క్రీడా శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియాతో కలిసి కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మంత్రి చెప్పారు. ఈ కమిటీ విచారణ నిర్వహించి తమకు నివేదికను ఇస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.  ఈ నివేదిక ఆధారంగా  బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి చెప్పారు. 

హెచ్ సీ ఏ కి పూర్తి స్థాయి పాలకవర్గం లేదన్నారు.  దీని కారణంగా ఈ నెల 25న  జరిగే మ్యాచ్ విషయమై పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ఇద్దరు మాత్రమే ఈ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడంతో కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయని మంత్రి  వివరించారు.. ఈ మ్యాచ్ విషయమై  ముందుగానే ప్రభుత్వంతో సమన్వయం చేసుకొంటే బాగుండేదన్నారు.

also read:జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటకు బాధ్యులపై చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూడాలని  హెచ్ సీ ఏ ను ఆదేశించినట్టుగా చెప్పారు. . ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం ప్రారంభించగానే క్షణాల్లో టికెట్ల విక్రయం జరిగిందన్నారు. 30 వేల టికెట్లుంటే లక్ష మంది టికెట్లు ఆశిస్తున్నారన్నారు. టికెట్ల విక్రయం పారదర్శకంగా జరగాలని ఆదేశించినట్టుగా మంత్రి చెప్పారు. ఇవాళ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు.  ఈ ఘటనలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.  బాధితుల వైద్య ఖర్చులను హెచ్ సీ ఏ భరిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  కరోనా తర్వాత తొలిసారిగా మ్యాచ్ ను హైద్రాబాద్ లో నిర్వహిస్తున్నారన్నారు. దీంతో మ్యాచ్ ను స్టేడియంలో చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు టికెట్ల కోసం ఆశిస్తున్నారని ఆయన చెప్పారు. 

click me!