
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీని ఫ్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు GHMC లోని ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభించింది. దీంతో నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉందనే సంకేతాలను యువతకు అందించింది. అందులో భాగంగా బల్దియాలోని 226 ఖాళీల భర్తీని వెంటనే చేపట్టాలని టీఎస్‌పిఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది.
జీహెచ్ఎంసీలో ఉన్న ఖాళీలను భర్తీకి చర్యలు చేపట్టాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో 200 టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు, 26మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. వీటి ద్వారా నగరంలో పెరిగిపోతున్న అక్రమాలను,కల్తీలను నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి టిఎస్‌పిఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు.