పాత కేసుల్లో తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గురువారం నాడు ఓ వీడియోను విడుదల చేశారు రాజాసింగ్.
హైదరాబాద్: తనను జైల్లో పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం నాడు వీడియోను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు టీఆర్ఎస్, ఎంఐఎంలే కారణమని రాజాసింగ్ ఆరోపించారు. హైద్రాబాద్ లో ఆందోళనలు, విధ్వంసాలు చేస్తున్నవారిని ఎంఐఎం నడిపిస్తుందని ఆయన ఆరోపించారు.
మునావర్ షో వద్దని చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ షో కారణంగానే హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. సీతా దేవి,శ్రీరాముడిని దూషించిన మునావర్ సో వద్దని చెప్పినా కూడా ఈ షో ను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించిందని ఆయన విమర్శించారు. ఐదు వేల మందితో ఈ షో ను నిర్వహించారని రాజాసింగ్ ఆరోపించారు. శాంతి భద్రతలు ఎందుకు క్షిణించాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.
undefined
also read:రాజాసింగ్ కు 41(ఎ) సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు : వివరణ ఇవ్వాలని ఆదేశం
తాను సోషల్ మీడియాలో గతంలో అప్ లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. పాతకేసుల్లో తనను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాను అన్నింటికి సిద్దపడి ఉన్నానని చెప్పారు..పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.
మునావర్ ఫరూఖీ షో నిర్వహణకు కారణమైన కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఓ వర్గం దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎమ్మెల్యే సభ్యత్వం ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని ఆయన కోరారు. అప్పట్లో ఎందుకు స్పీకర్ కు పిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు.తన శాసనసభ సభ్యత్వం రద్దు చేసినా కూడా ఫర్లేదన్నారు. ధర్మం కోసం తాను చనిపోవడానికి కూడా సిద్దంగా ఉన్నానని రాజాసింగ్ తేల్చి చెప్పారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేసిన వారిని, తలలు నరుకుతామన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆయన కోరారు. తాను విడుదల చేసిన వీడియో ఏ దేవుడి పేరును మాత్రం ప్రస్తావించలేదన్నారు. కేవలం చరిత్రను మాత్రమే ప్రస్తావించినట్టుగా రాజాసింగ్ వివరించారు.
మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 23న ఉదయం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే రోజున సాయంత్రం నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాలపై హైకోర్టులో పోలీసులు ఇవాళ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్ లో పోలీసులు హైకోర్టును కోరారు.
యూట్యూబ్ లో ఇటీవల రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉన్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఐఎం ఆందోళనలు నిర్వహించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ రంగంలోకి దిగింది. కేంద్ర బలగాలు నిన్న సాయంత్రం శాలిబండ నుండి ఆలియాబాద్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.