వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీకి రానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీకి రావొద్దని బయటివాళ్లు, ఇంటివాళ్లు కోరుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారంనాడు ఈ వ్యాఖ్యలు చేశారు. తానైతే అసెంబ్లీకి రానని నమ్మకం ఉందన్నారు. తాను ఉన్నా లేకున్నా కేసీఆర్ ఆశీస్సులు ధూల్ పేట వాసులపై ఉండాలని ఆయన కోరుకున్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత ఈ అసెంబ్లీకి ఎవరు వస్తారో, ఎవరు రారో తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానం నుండి ఎవరు విజయం సాధిస్తారో తెలియదన్నారు.గోషామహల్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధగా ఉందన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేసినట్టుగా రాజాసింగ్ చెప్పారు.గుడుంబా నిషేధం తర్వాత ధూల్ పేట వాసులు ఉపాధి కోల్పోయారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
2022 ఆగష్టు మాసంలో మహ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియాలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కొందరు నేతలు కోరుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో ఈ మేరకు రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై బీజేపీ జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గత మాసంలో బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డిపై గతంలో రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కిషన్ రెడ్డి నాయకత్వంలోనే బీజేపీ ఎదుర్కోనుంది.
also read:బీజేపీలోనే బతుకుతా... చనిపోతా: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేసినా ఎత్తివేయకపోయినా తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని రాజాసింగ్ గత మాసంలో ప్రకటించారు. అయితే ఇవాళ అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. తాను అసెంబ్లీకి రాకూడదని బయటివాళ్లతో పాటు ఇంటి వాళ్లు కూడ కోరుకుంటున్నారని పరోక్షంగా పార్టీలోని కొందరి గురించి రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.