
సిరిసిల్ల జిల్లా (rajanna sircilla district ) ఎల్లారెడ్డిపేట (yellareddypet) వెళ్తున్న బీజేపీ నేత , గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను (raja singh) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఫేస్‌బుక్ వివాదంతో స్థానిక టీఆర్ఎస్ (trs), బీజేపీ (bjp) శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. అయితే బీజేపీ కేడర్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న రాజాసింగ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మరోవైపు ఘర్షణకు సంబంధించి బీజేపీ నేతలపై మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) , టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (rasamayi balakishan) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ కనుమరుగు అవుతుందనే అక్కసుతోనే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికిపాల్పడటం దుర్మార్గమైన చర్య అన్నారు. యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని బీజేపీ నమ్ముకుందన్నారు. తమపై దాడులు చేస్తే ఊరుకోమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్‌ఎస్ కార్యకర్తపైన దాడులకు దిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. బీజేపీ సంస్కృతి ఇదేనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు.
బండి సంజయ్‌పై (bandi sanjay) నమ్మకం లేకనే బీజేపీకి చెందిన కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్ (ktr) సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. దీనిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలు.. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామచంద్రం అనే బీజేపీ కార్యకర్త పెట్టిన పోస్టులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని.. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై దాడిచేశారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్పొరేటర్లు.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే బండి సంజయ్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఆదేశాలతోనే టీఆర్‌ఎస్ శ్రేణుల మీద దాడి జరిగిందని ఆరోపించారు. బీజేపీ వాళ్లు పిడికెడే.. మేం పుట్టెడు మంది ఉన్నామని చెప్పారు. బుల్డోజర్ వచ్చేదాకా మేం ఊరుకుంటామా.. తొక్కితే పాతాళానికి పోతారని హెచ్చరించారు. తాము దాడులు జరిపితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు.