గొర్రెకుంట సామూహిక హత్యలు: సంజయ్ కు 60 నిద్రమాత్రలు అమ్మిందెవరు?

By telugu teamFirst Published May 29, 2020, 7:03 AM IST
Highlights

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 9 మందిని సామూహికంగా హత్య చేయడానికి వాడిన 60 నిద్రమాత్రలను సంజయ్ కుమార్ యాదవ్ కు ఎవరు అమ్మారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.

వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 9 మందిని హత్య చేయడానికి వాడిన 60 నిద్రమాత్రలను నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ఎక్కడి నుంచి పొందాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిద్రమాత్రలను పొడిగా చేసి దాన్ని విందులోని ఆహారంలో కలిపి 9 మంది స్పృహ తప్పేలా చేసి, వారిని సంజయ్ బావిలో పడేసినట్లు భావిస్తున్నారు. దీంతో ఔషధ నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. 

ప్రిస్క్రిప్షన్ లేకుండా సంజయ్ కుమార్ యాదవ్ కు నిద్రమాత్రలు ఎలా ఇచ్చారనే విషయంపై అంతర్గత విచారణ ప్రారంభమైంది. వరంగల్ నగరంలోని పలు మెడికల్ ఏజెన్సీలు, షాపుల్లో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ రఫీ తనిఖీలు చేపట్టారు. స్టాక్ పొజిషన్ ను పరిశీలిస్తున్నారు. 

సంజయ్ కుమార్ నిద్రమాత్రలను ఒక దుకాణం నుంచే పొందాడా, వేర్వేరు షాపుల్లో తీసుకున్నాడా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. డ్రగ్స్ అధికారులు మంగళవారంనాడు పోలీసు అధికారులను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత గొర్రెకుంట ఘటన స్థలంలో తనిఖీలు నిర్వహించారు. 

విచారణ పూర్తయిన తర్వాత మాత్రలు విక్రయించిన షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాస్ చెప్పారు. 

రఫిక అనే తన ప్రేయసి హత్యను కప్పిపుచ్చుకోవడానికి సంజయ్ కుమార్ యాదవ్ గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

click me!