రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులువుగా డబ్బులు చెల్లించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రైలు ప్రయాణికులకు దక్షిణ మద్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బుకింగ్ కౌంటర్లలో టిక్కెట్ల కొనుగోలుకు 'క్యూఆర్' (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా డబ్బులు చెల్లించే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుత కాలంలో అధిక శాతం మంది ప్రజలు నగదును జేబులో పెట్టుకోవడం లేదు. డిజిటల్ వ్యాలెట్లలో డబ్బును మెయింటెన్ చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ నగదు రూపంలోనే లావాదేవీలు జరపాల్సి వస్తోంది. అందులో రైల్వే టిక్కెట్ల కొనుగోలు ఒకటి. దీంతో కొన్ని సార్లు అటు ఉద్యోగులు, ఇటు ప్రయాణికులు చిల్లర సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ లోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో దీనిని అమలు చేయనున్నారు. టికెట్ విండో వెలుపల ఉన్న జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఫేర్ రిపీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణీకులు మరింత ఖచ్చితత్వం, పారదర్శకత కోసం స్టేషన్, క్లాస్, పిల్లలు లేదా పెద్దలు, ఛార్జీల సంఖ్య వంటి వివరాలు దానిపై ప్రదర్శిస్తారు.
ఛార్జీల లెక్కింపు తర్వాత జనరేట్ అయ్యే క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ ఫేర్ రిపీటర్లలో డిస్ ప్లే అవుతుంది. మొబైల్ ఫోన్ లోని పేమెంట్ యాప్ ల ద్వారా ప్రయాణికులు దానిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆ టిక్కెట్ ధరకు సరిపోయే డబ్బులు ప్రయాణికుడి ఖాతా నుంచి వెళ్లిపోతాయి. తరువాత టిక్కెట్ జనరేట్ అవుతుంది. దానిని ప్రయాణికులు తీసుకొని రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ కాగజ్నగర్, వికారాబాద్ స్టేషన్లలో ఈ నగదు రహిత లావాదేవీలను తొలుత అమలు చేయనున్నారు.