భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి.. 50 అడుగులు దాటిన నీటి మట్టం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

By Sumanth KanukulaFirst Published Aug 10, 2022, 9:13 AM IST
Highlights

భద్రాచలం వద్ద మరోసారి గోదావరి ఉధృతి పెరిగింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.10 అడుగులకు చేరింది.

భద్రాచలం వద్ద మరోసారి గోదావరి ఉధృతి పెరిగింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరిలో 12,58,826 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో.. ముంపు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చురికలు జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలం నుంచి దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురానికి బస్సులను బంద్‌ చేశారు.  


సోమవారం నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి సహా గోదావరి ఉపనదులన్నీ ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక నివాసాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిపై మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొంగి ప్రవహించే వాగులను దాటవద్దని కోరారు.

ఇక, గత నెల 16న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71.30 అడుగుల చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భద్రాచలం ఆలయం పరిసరాలతో పాటు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరోసారి గోదావరిలో నీటిమట్టం పెరడగంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

click me!