రెండున్నరేళ్లలో దుబ్బాక రూపురేఖలు మార్చా.. మార్పుకోసం అవకాశమివ్వండి: ఎమ్మెల్యే రఘునందన్ రావు

By Mahesh K  |  First Published Oct 20, 2023, 6:10 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాకలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉపఎన్నికలో గెలిచిన తర్వాత రెండున్నరేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చానని వివరించారు. మంచి కోసం, మార్పుకోసం బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలో ఈ రోజు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రచారం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఆమె విరుచుకుపడ్డారు. ఈ సభలో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచి బాధ్యతలు తీసుకున్న రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను గెలిపించిన రెండున్నరేళ్లలో దుబ్బాక నియోజకవర్గం రూపు రేఖలు మార్చానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మంత్రి హరీశ్ రావు పొద్దున లేస్తే అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మినహా ఏం చేస్తాడంటూ కామెంట్ చేశారు. దుబ్బాకలో నారీ శక్త వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొని మాట్లాడారు.

Latest Videos

రఘునందన్ రావు గెలిస్తే కరెంట్ మోటార్లకు మీటర్లు పెడతారని హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని దుబ్బాక ఎమ్మెల్యే మండిపడ్డారు. హరీశ్ రావు మాటలు అబద్ధాలని, ఎవరూ నమ్మరాదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మాత్రం వారు కేసీఆర్ సంకలో చేరడం ఖాయం అంటూ కామెంట్ చేశారు. యూపీలో రాహుల్ గాంధీని ఓడించిన ఘనత స్మృతి ఇరానీదేనని వివరించారు.

Also Read: బండికి బీజేపీ అధిష్టానం బ్రేక్? ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా?

తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద పడకల ఆస్పత్రిని నిర్మించి చూపించానని రఘునందన్ రావు అన్నారు. తనకు భయపడే దుబ్బాకలో బస్టాండ్ కట్టించారని వివరించారు. దుబ్బాక అభివృద్ధి గురించి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సోయి లేదని ఆగ్రహించారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ అని రఘునందన్ రావు అన్నారు. మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 

click me!