
వరంగల్: ఇద్దరు అమ్మాయిల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం యువకుడు హాస్పిటల్ లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మోపిరాలకు చెందిన చెందిన సందీప్ ల్యాబ్ టెక్నీషియన్. ఇతడు మహబూబాబాద్ లోని ఓ హాస్పిటల్ లో పనిచేస్తూ అక్కడే వుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. వీరిలో ఓ అమ్మాయితో సందీప్ ప్రేమలో పడ్డాడు.
read more హైదరాబాదులో పట్టపగలు యువతిపై ఆటో డ్రైవర్ కిడ్నాప్, రేప్ కట్టుకథనే
అయితే ఇటీవల నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని మిగతా ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేశారు. అందుకు కారణం నువ్వేనంటూ సందీప్ ను బెదిరించారు. దీంతో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇలా మరోమారు ఈనెల 12వ తేదీన యువతులిద్దరు ఫోన్ చేసి బెదిరించారు.
ఇలా అమ్మాయిల బెదిరింపులతో బెంబేలెత్తిపోయిన సందీప్ మనస్థైర్యాన్ని కోల్పోయి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడ ప్రియురాలు చనిపోయిన నేరం తనపై వస్తుందోనని భయపడిపోయిన అతడు స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయిన సందీప్ ను గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.