
హైదరాబాద్ : తనను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి మీద ఓ బాలిక తిరగబడింది. అతనిని కర్రతో చావచితక బాదింది. తనను వేధించొద్దని పలుమార్లు హెచ్చరించినా.. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి వినకపోవడంతో అపరకాళికలా మారింది. సదరు వ్యక్తి తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేయడమే కాకుండా.. తన మీద కూడా కన్నేసాడు. పలుమార్లు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా ఆ బాలిక తెలిపింది. ఎన్నిసార్లు చెప్పినా అతను వినకపోగా, మళ్లీ తనను లైంగికంగా వేధించడం మొదలుపెట్టడంతో ఆ దుర్మార్గుడిపై కర్రతో దాడి చేసింది.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న బాలిక మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటనలో భాగంగా ఆ బాలిక అతడి మీద కర్రతో దాడి చేసింది. ఈ ఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సోమేష్ కుమార్ నిమాయకంపై మండిపడ్డ భట్టి విక్రమార్క...ఆయన ఇంట్రెస్ట్ ఏంటో అంటూ విమర్శలు...
ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయింది. కుటుంబకలహాల నేపథ్యంలో తన నలుగురు పిల్లలను భర్త దగ్గర వదిలేసి తాను ఒంటరిగా హైదరాబాదుకు వచ్చింది. ఆ తర్వాత పద్మనాభ నాయక్ (45) అనే వ్యక్తితో స్నేహం కుదిరి సహజీవనం చేస్తుంది. నిరుడు వీరిద్దరూ హైదరాబాదుకు వలస వచ్చారు. కండ్లకోయ దగ్గర ఉన్న జీవీకే ఈఎంఆర్ఐ లో పనిచేస్తున్నారు. అక్కడ దగ్గర్లోనే ఉన్న రేకుల షెడ్డులో ఉంటున్నారు.
కాగా, మహిళ 17యేళ్ల కూతురు మూడు నెలల క్రితం తల్లి దగ్గరికి వచ్చింది. ఆమెను చూసిన పద్మనాభనాయక్ ఆమె మీద కన్నేశాడు. తండ్రి తర్వాత మారుతండ్రిగా బాగోగులు చూసుకోవాల్సిన అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో పలుమార్లు ఆ బాలిక అతడిని హెచ్చరించింది. అయినా అతడి బుద్ధి మారలేదు.
మే 8వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక మీద మరోసారి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. మద్యం మత్తులో తూలిపోతూ వచ్చిన పద్మనాభనాయక్ ఆమె మీద లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలిక అందుబాటులో ఉన్న దొడ్డు కర్రతో అతడి తల మీద కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని తల్లి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పద్మనాభ నాయక్ మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో మృతి చెందాడు. విషయం తెలియడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.