Rajasingh: హరీశ్‌రావుతో రాజాసింగ్.. బీఆర్ఎస్‌లో చేరుతారా?

Published : Jul 14, 2023, 02:28 PM IST
Rajasingh: హరీశ్‌రావుతో రాజాసింగ్.. బీఆర్ఎస్‌లో చేరుతారా?

సారాంశం

రాజాసింగ్ తాజాగా రాష్ట్రమంత్రి హరీశ్‌రావుతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ సస్పెన్షన్ విధించిన తర్వాత రాజాసింగ్ దాదాపు సైలెంట్ అయిపోయారు. తాజాగా, తనతో విభేదాలున్న కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మారారు. ఈ సందర్భంలో ఆయన హరీశ్ రావుతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాజాసింగ్ బీఆర్ఎస్‌లో చేరుతారా? అనే సందేహాలు వస్తున్నాయి.  

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిశారు. రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతున్న తరుణంలో ఆయన హరీశ్‌రావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడంతో రాజాసింగ్ పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది. 

మహమ్మద్ ప్రవక్తపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో రాష్ట్రంలో ఆందోళనలు రేపింది. ఎంఐఎం సహా పలువురు ముస్లింలు ఆ వీడియోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలోనే బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కాకుండా.. కేవలం గోషామహల్ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఉన్నారు. ఆ తర్వాత రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనంతరం, ఆయన బయటకు వచ్చారు.

రాజాసింగ్‌ను బీజేపీలోకి కిషన్ రెడ్డే తీసుకువచ్చారని చెబుతారు. కానీ, ప్రస్తుతం రాజాసింగ్‌కు కిషన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నది. కనీసం మాట్లాడుకునేంత సన్నిహితం కూడా లేదని తెలుస్తున్నది. కాగా, అదే కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించింది. దీంతో పార్టీలో రాజాసింగ్‌కు పరిస్థితులు ప్రతికూలంగా మారినట్టు అర్థం అవుతున్నది.

తెలంగాణ బీజేపీలో వర్గాలుగా ఉన్నప్పుడూ రాజాసింగ్.. బండి సంజయ్‌కు గట్టి మద్దతు ఇచ్చినట్టు తెలిసింది. బండి సంజయ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించాలనే అభిప్రాయాన్ని పలుమార్లు వెల్లడించారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా బండి సంజయ్ పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, అధిష్టానం ఈ సస్పెన్షన్ ఎత్తేయలేదు.

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదనే ప్రచారం బలంగా ఉన్నది. దీన్ని పటాపంచలు చేయడానికి ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో, అదీ ఎన్నికలు సమీపించిన ఈ వేళ ఈ రెండు పార్టీల నేతలు సమావేశం కావడానికి సాహసించరు. ఈ నేపథ్యంలో రాజాసింగ్.. హరీశ్‌రావుతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్‌రావుతో భేటీ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. కానీ, గతంలో రాజాసింగ్ ఇలా ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భాలు పెద్దగా లేవు. హిందుత్వ ఎజెండాను బలంగా చెప్పే రాజాసింగ్.. నియోజకవర్గం గురించి అసెంబ్లీలోనే మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు రూటు మార్చడంపై చర్చ మొదలైంది.

Also Read: రెండు నెలల హనీమూన్ ఖతం.. కాదు, కాదు, ఆరు నెలలు కావాలి.. కర్ణాటక విధాన పరిషత్‌లో నవ్వులే నవ్వులు

ఇదిలా ఉండగా.. గతంలో ఆయన పార్టీ మారడం గురించి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీ విడిచిపెట్టబోనని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా ధర్మం కోసం ఇదే పార్టీలో ఉంటానని చెప్పారు. తనకు వేరే పార్టీ నప్పదనీ అన్నారు. 

రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయాలైనా జరగవచ్చు. కాబట్టి, రాజాసింగ్ భేటీ యొక్క ఆంతర్యం, అసలైన విషయం బయటకు రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజాసింగ్ స్వయంగా దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తేగానీ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడదనీ అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్