రేపే వినాయక విగ్రహల నిమజ్జనం: ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

By narsimha lodeFirst Published Sep 8, 2022, 12:12 PM IST
Highlights

వినాయక విగ్రహల నిమజ్జనం కోసం హైద్రాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.మట్టి విగ్రహలతో పాటు ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు. 

హైదరాబాద్:  హైద్రాబాద్ లో వినాయక విగ్రహల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. రేపు ట్యాంక్ బండ్  లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయనున్నారు.  నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై  జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన క్రేన్ లను ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహలతో పాటు ఫ్లాస్టర్ ఆఫ్ ఫారిస్ తో చేసిన విగ్రహలను కూడ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు. 

ట్యాంక్ బండ్ పై 15, ఎన్టీఆర మార్గ్ లో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్ లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని 354 కి.మీ మేర గణేష్ విగ్రహల శోభాయాత్ర సాగనుంది. ట్యాంక్ బండ్ తో పాటు  74 ప్రాంతాల్లో బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ.

 హైద్రాబాద్ పాతబస్తీ పరిధిలోని సౌత్ జోన్  లో సుమారు 1700 వినాయక విగ్రహలున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 2500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.  గణేష్ విగ్రహల నిమజ్జన విధుల్లో 10 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ విగ్రహ ల నిమజ్జనంలో 20 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వినాయక విగ్రహల నిమజ్జన కార్యక్రమ పర్యవేక్షణకు గాను 168 మంది అధికారులను నియమించారు.ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు బుధవారం నాడు పరిశీలించారు. 

గణేష్ యాక్షన్ టీమ్ లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ప్రతి టీమ్ లో 23 మంది సభ్యులుంటారు. మూడు నుండి నాలుగు కి.మీ పరిధిలోని గణేష్ విగ్రహల నిమజ్జనం కోసం ఒక్కో టీమ్ మూడు షిప్టుల వారీగా విధులు నిర్వహించనుంది. రేపు గణేష్ విగ్రహల నిమజ్జనాల నేపథ్యంలోట్యాంక్ బండ్ పై  వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

ట్యాంక్ బండ్ లోనే గణేష్ విగ్రహల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గతంలో  డిమాండ్ చేసింది.ఈ విషయమై బైక్ ర్యాలీకి పూనుకొంది. బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వినాయక నిమజ్జనానికి అనుమతివ్వకపోతే ప్రగతి భవన్ లో వినాయక విగ్రహలు నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న ట్యాంక్ బండ్ పై  ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిందని బండి సంజయ్ చెప్పారు.

click me!