
కూకట్‌పల్లిలో భవనం కూలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదానికి కారణమైంది . ఈ నేపథ్యంలో బిల్డింగ్ ఓనర్ పద్మజకి జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీశారు. కాగా.. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో వున్న భవనం నాలుగు, ఐదో అంతస్తు స్లాబ్ శనివారం ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. భవన యజమాని సహా పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. నాణ్యతా లోపం కారణంగానే భవనం శ్లాబు కూలినట్లుగా తెలుస్తోంది. మృతులను యూపీకి చెందిన దయా శంకర్,ఆనంద్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.