భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలు అధికారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నగరంలో శిథిలావస్థలో వున్న 483 భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తెలిపారు.
తెలంగాణలో గడిచిన ఐదు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండుకోవడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. రాజధాని హైదరాబాద్ సైతం ఎడతెరిపి లేని వర్షాలతో అల్లాడుతోంది. ఇప్పటకే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. శిథిల భవనాలు అధికారులను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో వుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని విజయలక్ష్మీ అన్నారు. ఇప్పటి వరకు 900 ఫిర్యాదులు వచ్చాయని.. వీటన్నింటిని పరిష్కరించామని ఆమె తెలిపారు. నగరంలో శిథిలావస్థలో వున్న 483 భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చామని వీటిలో 92 భవనాలకు మరమ్మత్తులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని, మరో 19 మభవనాలను సీజ్ చేశామని మేయర్ వెల్లడించారు.
ALso Read: పొంగిపొర్లుతున్న వాగులువంకలు: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గద్వాల్ విజయలక్ష్మీ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 36 చోట్ల నాలా పనులు జరిగితే .. 30 చోట్ల ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. నగరంలో సీఆర్ఎంపీకి చెందిన 28 బృందాలు పనిచేస్తున్నాయని.. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ సైతం 24 గంటలూ పనిచేస్తుందని మేయర్ వెల్లడించారు.