జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ పక్కా ప్లాన్, రంగంలోకి అల్లు అర్జున్ మామ

By telugu teamFirst Published Nov 23, 2020, 9:51 AM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. డివిజన్లవారీగా ఇంచార్జీలను నియమించారు.

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యమైన ఎదురు దెబ్బతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో డివిజన్లవారీగా బాధ్యులను రంగంలోకి దించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులకు తోడుగా 150 డివిజన్లకు కూడా బాధ్యులను నియమించారు. 

ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా ప్రభావం చూపించగలిగేవారిని ఎంచుకుని బాధ్యులను నియమించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు డివిజన్లవారీగా బాధ్యతలు అప్పగించారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కాగానే వారు రంగంలోకి దిగారు. 

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర్ డివిజన్ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. అక్కడి బాధ్యతలను చూసుకునేందుకు కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన సిరిసిల్లకు చెందిన తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కె. రవీంద్ర రావును ఈ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు నిజాంపేట కార్పోరేషన్ మేయర్ నీలా గోపాల రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. 

జూబ్లీహిల్స్ డివిజన్ లో పోటీ చేస్తు్న కాజా సూర్యనారాయణకు మద్దతుగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రెడ్డిని రంగంలోకి దించారు. ఆయనతో పాటు సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. సినీ పరిశ్రమతో ఆయనకున్న అనుబంధం కలిసి వస్తుందని కేసీఆర్ భావించి ఉండవచ్చు. 

గాంధీ నగర్ డివిజన్ బాధ్యతలను ఎమ్మెల్సీ, సీఎం కూతురు కవిత తీసుకున్నారు. జాగృతి కార్యకర్తలను పెద్ద యెత్తున ఆమె ఈ డివిజన్ లో దించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ బాధ్యతలను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు అప్పగించారు. 

బంజారాహిల్స్ డివిజన్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు కూతురు విజయలక్ష్మి పోటీలో ఉన్నారు. ఆమెకు సాయంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దించారు. 

click me!