జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ టార్గెట్ లో తేడా, ఎందుకంటే...

By telugu teamFirst Published Nov 23, 2020, 8:19 AM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ మారింది. కాంగ్రెసు ఊసు కూడా ఎత్తకుండా బిజెపిని లక్ష్యంగా ఎంచుకుని వాగ్బాణాలు విసురుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెసు ఊసు కూడా ఎత్తడం లేదు. బిజెపి లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు. బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకుని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

కేసీఆర్ 2018 శానససభ ఎన్నికల్లో కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ బిజెపిని పట్టించుకోలేదు. 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు మీదనే గురిపెట్టి విమర్శలు చేశారు. కాంగ్రెసును ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకుని ఆ పని చేశారు.

2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెసు 2 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బిజెపి నాలుగు డివిజన్లలో విజయం సాధించింది. టీఆర్ఎస్ 99 డివిజన్లలో విజయం సాధించింది. కేసీఆర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కూడా బిజెపినే లక్ష్యంగా ఎంచుకున్నారు. 

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను కేసీఆర్ పూర్తిగా బలహీనపరిచారు. ఆ పార్టీల నుంచి గెలిచిన శాసనసభ్యులను చాలా మందిని వరుస రెండు విజయాల పరిణామ క్రమంలో టీఆర్ఎస్ లో కలుపుకున్నారు. బిజెపి శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 

అయితే, దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా బిజెపి హైదరాబాదులో తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది. పైగా, హైదరాబాదులో బిజెపికి తగిన క్యాడర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా బిజెపిని ఎంచుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్నారు. 

click me!