రాజ్యసభ ఎన్నికలు : వాళ్లిద్దరికీ ఆరేళ్లు.. గాయత్రి రవికి రెండేళ్లే పదవీకాలం, కేసీఆర్ వ్యూహం వెనుక..?

By Siva KodatiFirst Published May 18, 2022, 8:28 PM IST
Highlights

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్ధులను ఎంపిక చేశారు కేసీఆర్. హెటిరో అధినేత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ  పత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, గాయత్రీ రవిలను అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిలో గాయత్రీ రవి రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ (trs) తరపున అభ్యర్ధులను ఎంపిక చేశారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . హెటిరో అధినేత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి (Parthasaradhi Reddy) , నమస్తే తెలంగాణ  పత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు (Damodar Rao) , గాయత్రీ రవిలను (Gayatri Ravi ) టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఇటీవల బండ ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ప్రకటించిన ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధుల్లో (trs rajya sabha candidates ) ఉప ఎన్నిక జరగనున్న స్థానంలో గాయత్రి రవిని ఎంపిక చేశారు. 

ఆయన ఈ పదవిలో కేవలం రెండేళ్లు మాత్రమే వుంటారు. దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు మాత్రం ఆరేళ్లు ఎంపీలుగా వ్యవహరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన రేపు (మే 19న) గాయత్రి రవి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇంకా నోటిఫికేషన్ జారీ చేయనందున వారిద్దరూ తమ నామినేషన్ పత్రాలను తర్వాత సమర్పిస్తారు. అసెంబ్లీలో వున్న బలం నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్‌‌కే దక్కనున్నాయి. దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలని పూర్తి కాలపరిమితి వుండేలా ఎంపిక చేసి.. రవికి మాత్రం రెండేళ్లు వుండే పదవిని కేసీఆర్ ఎందుకు కట్టబెడుతున్నారనే చర్చ సర్వత్రా నడుస్తోంది. 

2018లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన గాయత్రి రవి ఓటమి పాలయ్యారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు గాయత్రి రవి సమీప బంధువు. మున్నూరు కాపు వర్గంలో మంచి పలుకుబడి వున్నందున .. రవిని ఈ రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి ఎంపిక చేశారనే చర్చ నడుస్తోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కానీ రవిని కేసీఆర్ బరిలోకి దింపే అవకాశం వుంది. అందుకే గులాబీ బాస్ ఈ వ్యూహం పన్నినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Also Read:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసిన కేసీఆర్.. లిస్ట్ ఇదే

గాయత్రి రవి 1964, మార్చి 22న మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇనుగుర్తి గ్రామంలో జ‌న్మించారు. ఈయ‌న‌కు భార్య విజ‌య‌ల‌క్ష్మి, కూతురు గంగా భ‌వాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. గ్రానైట్ వ్యాపారిగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వుంది. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులుగా ...  తెలంగాణ మున్నూరు కాపు ఆల్ అసోసియేష‌న్ జేఏసీ గౌర‌వ అధ్య‌క్షులుగా వ్యవహరిస్తున్నారు. స్వగ్రామంలో బ‌డులు, గుడులు, ర‌హ‌దారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించి.. దాతగానూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 

మేడారం సమ్మక్క సారక్క ఆల‌య అభివృద్ధికి త‌న వంతు ఆర్థిక సాయం చేశారు. 2016 లో జ‌రిగిన జాత‌ర సంద‌ర్భంగా రూ. 3.5 కోట్లు వెచ్చించి అమ్మ‌వార్ల గ‌ద్దెలు, క్యూలైన్ల‌కు గ్రానైట్ రాళ్లు, స్టీల్ రెయిలింగ్‌తో ఆధునీక‌రించారు. 2018లో సుమారు రూ. 20 ల‌క్ష‌లు వెచ్చించి మ‌రికొన్ని క్యూలైన్ల‌ను ఆధునీక‌రించారు. వివిధ ప్రాంతాల నుంచి 122 ర‌కాల పూల‌ను తీసుకొచ్చి అమ్మ‌వారి గ‌ద్దెల చుట్టూ అలంక‌రించారు.

ఖ‌మ్మం గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు గాయ‌త్రి ర‌వి క్వారీలే జీవ‌నాధారం అని చెప్పొచ్చు. అక్కడ సుమారు 500 స్లాబ్ ఫ్యాక్ట‌రీలు, వాటిలో 2000 క‌ట్ట‌ర్లు, 150 టైల్స్ ఫ్యాక్ట‌రీలు, మ‌రో 10 ఎక్స్‌పోర్ట్ యూనిట్‌లు వున్నాయి. వీటిపై ఆధారపడి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సుమారు ల‌క్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌లకు 60 నుంచి 70 శాతం ముడి గ్రానైట్.. గ్రాయ‌త్రి గ్రానైట్ సంస్థ నుంచే స‌ర‌ఫ‌రా అవుతోంది.

click me!