నా నోట్లె మన్ను కొట్టకుర్రి.. అవసరమైతే ‘పద్మ శ్రీ’ వెనక్కి ఇచ్చేస్తా.. బీజేపీ నేతల వైఖరిపై మొగులయ్య ఆవేదన

By Mahesh KFirst Published May 18, 2022, 7:54 PM IST
Highlights

కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తాజాగా, ఓ వీడియోలో బీజేపీ నేతల వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 1 కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు.
 

హైదరాబాద్: పద్మశ్రీ, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య బీజేపీ నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నా చితకగా కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడేవాడినని, తన కళను తొలిగా టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు. సీఎం కేసీఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను బయటి లోకానికి తెలిసానని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో వెల్లడించారు.

తెలంగాణ జానపద సంస్కృతిని కాపాడాలనే తపన సీఎం కేసీఆర్‌లో ఉన్నదని కిన్నెర కళాకారుడు మొగులయ్య అన్నారు. తనను సీఎం కేసీఆర్ సత్కరించిన తర్వాత బయటి ప్రపంచానికి తెలిసానని, ఆ తర్వాతే ఓ సినిమాలో పాట పాడానని వివరించారు. పాట పాడిన తర్వాత కొన్నాళ్లకు తనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు.

ఈ అవార్డు కోసం కూడా తమ ఎమ్మెల్యే (అచ్చంపేట) గువ్వల బాలరాజు సహకరించి తనను ఢిల్లీకి పంపించాడని వివరించారు. తనకు సీఎం కేసీఆర్, తమ ఎమ్మెల్యే ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటున్నారని తెలిపారు. ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మొగులయ్య రూ. 1 రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి రూ. 1 కోటి కేసీఆర్ ప్రకటించారు. 

తాజాగా, ఈ డబ్బు కేసీఆర్ ఇంటి నుంచే ఇస్తున్నాడా? అంటూ అచ్చంపేటలోని కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ శ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వారు వాదిస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే.. పద్మ శ్రీ అవార్డు కూడా వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. పద్మ శ్రీ అవార్డు ఎవరిదైనా సరే.. దాని ద్వారా నాపై రాజకీయాలు చేస్తే.. నా నోట్లె మన్ను కొట్టాలని చూస్తే ఆ అవార్డు వెనక్కి ఇచ్చేస్తాని అని ఆవేదనతో చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తనను గుర్తించిందని వివరించారు.

click me!