భాగ్యనగరంలో వినాయక ఉత్సవాలు.. ఖైరతాబాద్ గణపయ్య విశేషాలివే..!

By Mahesh KFirst Published Aug 26, 2022, 4:39 PM IST
Highlights

భాగ్యనగరంలో ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏటా విభిన్నమైన రూపంతో భారీ కాయాన్ని ఇక్కడ నిలబెడతారు. ఈ సారి 50 అడుగుల ఎత్తుతో మట్టి వినాయకుడు 11 రోజులపాటు కొలువుదీరనున్నాడు.

హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే దేశమంతటా ఒక సంబురం ఉబికి వస్తుంది. ఉత్సవాలను ఎంతో హుషారుగా నిర్వహిస్తారు. ఉత్తరాది.. దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా బొజ్జ గణపయ్య రాజసంగా కొలువుదీరుతాడు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవ సంరంభం ఉత్తేజంగా సాగుతుంది. హైదరాబాద్ వినాయక ఉత్సవాల గురించిన ప్రస్తావన వస్తే అందులో తప్పకుండా ఖైరతాబాద్ వినాయకుడి చర్చ జరిగే తీరుతుంది. ఖైరతాబాద్ గణేషుడికి అంత క్రేజ్ ఉంది మరీ.. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో గణేషుడి ఉత్సవాల గురించి చూచాయగా చూద్దాం.

ఖైరతాబాద్ గణేషుడు అనగానే అందరి మదిలో భారీ కాయం మెదులుతుంది. నగరంలో మరెక్కడా లేని విధంగా రూపం, ఎత్తు, పొడువులతో గణపతి విగ్రహం దర్శనం అవుతుంది. 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఇక్కడ మొదలైన వినాయక చవితి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, ప్రతి ఏడాది ఈ ఎత్తును పెంచుతూ వచ్చారు. 60 ఏళ్ల వరకు ఈ పెరుగుదల కొనసాగింది. 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.

ఈ సారి ఖైరతాబాద్‌లో 50 అడుగుల వినాయకుడు కొలువుదీరనున్నాడు. పంచముఖ రూపంలో గణపయ్ మన అందరికీ దర్శనం ఇవ్వనున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి రూపంలో మరో మార్పు కూడా ఉన్నది. ఈ ఏడాది ఇక్కడ మట్టితో తయారు చేసిన మహాగణపతి కొలువుదీరబోతున్నాడు.

ఖైరతాబాద్‌లో భారీ విగ్రహాన్ని నిలబెడతారు. కాబట్టి... కొన్ని నెలల ముందు నుంచే ఇక్కడ విగ్రహ నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది జూన్‌లో ఈ విగ్రహ నిర్మాణ పూజ చేశారు. 11 రోజులపాటు ఉత్సవాలు జరిగిన తర్వాత ప్రజల పూజలు అందుకున్న తర్వాత ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.

click me!