గద్దర్ కుమారుడు సూర్య రాజకీయాల్లోకి రానున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలన్న గద్దర్ చివరికోరికను తీర్చడానికి రేవంత్ రెడ్డి నడం బిగించారు.
హైదరాబాద్ : ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం అందర్నీ కలిచి వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించి ఓ వార్త రాజకీయంగా చక్కర్లు కొడుతుంది. గద్దర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ తో సన్నిహితంగా తిరిగారు. భారత్ జోడో పాదయాత్రలో తెలంగాణకు చేరుకున్న రాహుల్ గాంధీకి ముద్దులిచ్చారు. తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా సూచనలు పంపించారు.
ఇక గద్దర్ మరణించిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అత్యవసర పనులను సైతం పక్కన పెట్టారు. గద్దర్ భౌతికకాయానికి అభిమానుల సందర్శన నిమిత్తం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను చూసుకున్నారు. గద్దర్ అంతిమయాత్రలోనూ తానే ముందుండి నడిపించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. ఇలా గద్దర్ కు అన్ని తానే రేవంత్ రెడ్డి చేశారు.
జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. ఆయనను బీఆర్ఎస్ లోకి ఎలా తీసుకుంటారు...??...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినా.. రేవంత్ రెడ్డే అన్నీ చూసుకున్నారని వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ఆ తర్వాత గద్దర్ సతీమణికి లేఖ రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గద్దర్ ను తన సొంత మనిషిలా చూసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఓ వార్త చర్చనీయాంశంగా మారుతుంది. గద్దర్ కుమారుడు సూర్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్లు ఆ వార్త. గతంలో గద్దర్ బతికున్న రోజుల్లో తన కొడుకు సూర్యను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న కోరికను అప్పట్లో రేవంత్ రెడ్డికి చెప్పారట. గద్దర్ మరణాంతరం ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. సూర్యకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని.. అలా గద్దర్ కు ఇచ్చిన మాటను.. చివరి కోరికను తీర్చాలని అనుకున్నారట.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమారుడు సూర్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాదులోని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దీనికోసం పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక్కడ కనక కుదరకపోతే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని కూడా రేవంత్ రెడ్డి మనసులో ఉందని తెలుస్తోంది.
గద్దర్ ఎంతో మంచి వ్యక్తి.. ఆయన లేకపోయినా కుమారుడి రూపంలో ఆయనకు గౌరవం ఇవ్వాలని.. టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలవాలని కాంగ్రెస్ అనుకుంటుందంట. ఢిల్లీ హై కామాండ్ కు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. హై కమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఎన్నికల ముందు ఏం జరగబోతుందో.. టికెట్ ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా కలిసి వస్తాయో చూడాల్సిందే.