కేసీఆర్ ను ఓడించిన మొనగాడు గడ్డం ప్రసాద్ కుమార్...

By SumaBala Bukka  |  First Published Dec 13, 2023, 2:19 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును గడ్డం ప్రసాద్ కుమార్ ఐదువేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. అది ఆయన రాజకీయ జీవితంలో కీలకమలుపు అని చెప్పుకోవచ్చు. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయగా.. ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలతో పాటు, బీఆర్ఎస్ కూడా ప్రసాద్ కుమార్ ను సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ తరఫున మద్దతు తెలుపుతూ కేటీఆర్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. దీంతో గడ్డం ప్రసాద్ ఎంపిక ఏకగ్రీవం అయ్యింది. 

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గురించి చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ఐదువేల ఓట్ల మెజారిటీతో ఓడించిన ఎమ్మెల్యేగా చెప్పుకోవాలి. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీచేసిన ఆయన కేసీఆర్ పై దాదాపు 5వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

Latest Videos

స్పీకర్ ఎన్నిక ఇక ఏకగ్రీవమే.. మద్దతు తెలిసిన బీఆర్ఎస్..

గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలయ్యింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఓడిపోయారు. ఓటమితో పార్టీ మారలేదు. నియోజకవర్గాన్నీ మార్చలేదు. వికారాబాద్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2008లో తొలిసారిగా వికారాబాద్ నుంచి గెలుపొందిన ఆయన 2009లో మళ్లీ వికారాబాద్ నుంచి గెలుపొందారు. 2014, 2018లో వికారాబాద్ నుండి రెండుసార్లు ఓడిపోయారు. కానీ 2023లో మళ్లీ గెలిచారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 3వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 

గడ్డం ప్రసాద్ స్వస్థలం వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం,  మర్పల్లి కళ్యాణ్ గ్రామం, 1964లో జన్మించారు. తల్లిదండ్రులు గడ్డం ఎల్లమ్మ, ఎల్లయ్యలు. రైతు కుటుంబానికి చెందిన ప్రసాద్ తాండూరులో ఇంటర్ వరకు చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి బి సంజీవరావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి బరిలోకి దిగారు.  ఆ సమయంలో టిఆర్ఎస్ అభ్యర్థి కే చంద్రశేఖర్ పై  దాదాపు 5వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

ఆ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. టెక్స్ టైల్ శాఖా మంత్రిగా సేవలందించారు.రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఆయన పరాజయాన్ని చవిచూశారు. 2018 తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు.  ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయాన్ని సాధించి స్పీకర్గా నియమితులయ్యారు. 

గడ్డం ప్రసాద్ కుమార్ ను అందరూ ముద్దుగా ప్రసాద్ అన్నా అని పిలుచుకుంటారు. జీవిత భాగస్వామి పేరు శైలజ, వీరికి ఇద్దరు పిల్లలు.

click me!