తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. నామినేషన్ పత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్ సంతకాలు పెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పదవి కోసం బీఆర్ఎస్ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. గడ్డం ప్రసాద్ ఎన్నికకు బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే కానుంది.
స్పీకర్ పదవి కోసం గడ్డం ప్రసాద్ కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీతక్క సంతకాలు చేశారు. అలాగే బీఆర్ఎస్ తరుఫున మద్దతు తెలుపుతు మాజీ మంత్రి కేటీఆర్ కూడా సంతకం చేశారు. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ఎంపిక చేసింది. స్పీకర్ పదవి కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ప్రొటెం స్పీకర్ గా నియమితులైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిసెంబర్ 9న కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే నిబంధనలను ఉల్లంఘించి ఒవైసీని కాంగ్రెస్ పార్టీ ప్రొటెం స్పీకర్ గా నియమించిందని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే శాసన సభకు హాజరుకాలేదు. వారంతా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. శాశ్వత స్పీకర్ వచ్చిన తరువాతే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ పార్టీకి అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తనకు మరో రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లేఖ రాశారు. దీంతో ఆయన కూడా శాశ్వత స్పీకర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.