
హైదరాబాద్: తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభలో పెద్దగా చర్చ ఏమీ జరగలేదు. దివంగత ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించడమే ప్రధానంగా సాగింది. రెండో రోజు మాత్రం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వరద నష్టం, వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగింది. మరో ముఖ్యమైన పరిణామం ఏమంటే.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గతంలో పలు అభ్యంతరాలు, సూచనలు చెబుతూ వెనక్కి పంపిన నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. మళ్లీ ఆ నాలుగు బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించనున్నారు. ఈ సారి గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులు ప్రవేశపెడుతామని బీఏసీ భేటీలో ప్రభుత్వం చెప్పింది. ఇందులో గవర్నర్ వెనక్కి పంపించిన నాలుగు బిల్లులూ ఉన్నాయి.శుక్రవారం నాటి సమావేశాల్లో ప్రభుత్వం ఈ నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ) బిల్లును మంత్రి హరీశ్ రావు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను పున:పరిశీలించి ఆమోదం తెలుపాలని సభను కోరారు.
ఈ బిల్లును తిరస్కరిస్తూ రాజ్‌భవన్ నుంచి మూడు సందేశాలు అందాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు తెలిపారు. ఈ బిల్లుల పై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం, ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. రెండో రోజు సమావేశాలు రాత్రి 10. 20 గంటల వరకు సాగాయి. ఈ బిల్లులను ఆమోదించిన తర్వాత సభను నేటికి (శనివారం) వాయిదా వేశారు. నేడు ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న సభకు తెలిపారు.