తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇవాళ బీజేపీలో ఆమె చేరారు.
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు బీజేపీలో చేరారు.తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టక ముందు తమిళిసై సౌందరరాజన్ బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళిసై సౌందర రాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19న ఆమోదించారు.
undefined
పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుండి పోటీ చేయడానికి తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తమిళిసై సౌందర రాజన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బీజేపీ తమిళనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అన్నామలై తమిళిసై సౌందరరాజన్ కు బీజేపీ సభ్యత్వాన్ని అందించారు. రాష్ట్రానికి తన వంతు సహకారం అందించేందుకు గాను తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ పదవిని వదులుకున్నారని అన్నామలై చెప్పారు. తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అందుకే ఇవాళ బీజేపీలో చేరారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లను ఎన్‌డీఏ గెలుచుకుంటుందని అన్నామలై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీని, తమిళ ప్రజల పట్ల తమిళిసైకి ఉన్న ప్రేమను గవర్నర్ పదవిని వదులుకోవడం చూపుతుందన్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ తూత్తుకుడి పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు కూడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి నుండి తమిళిసై సౌందరరాజన్ గణనీయమైన ఓట్లను సాధించారు.