
వరంగల్: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఇప్పటికీ పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో మమకారం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తున్నది. ఇప్పటికీ ఆయనపై అమితంగా అభిమానం కురిపిస్తున్నారు. వరంగల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా ఈ విషయం స్పష్టమైంది.
ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించడానికి లేవగానే సభంతా సందడిగా మారింది. ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. భారత్ మాతాకీ అంటూ ఆయన అనగానే స్పష్టంగా జై అంటూ అభిమానులు అనడం వినిపించింది. ఆయన ప్రసంగం ఆద్యంతం సభకు హాజరైన వారు ఆసక్తిగా విన్నట్టు కనిపించింది.
ఈ ప్రసంగంలో నా మోడీ అంటూ పలుమార్లు మాట్లాడిన బండి సంజయ్ ప్రధానిని ఆకాశానికెత్తారు. బీజేపీ పార్టీ తనకు అనేక అవకాశాలు కల్పించిందని ఉద్వేగంగా మాట్లాడారు. ఎంపీ టికెట్ ఇస్తే కరీంనగర్ ప్రజలు గెలిపించారని, తమ కేంద్ర నాయకత్వం తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు. మోడీని చూస్తే చాలు అని అనుకున్న తాను.. ఇప్పుడు మోడీ నోటి వెంట సంజయ్ అని పిలవడం విని సంతోషిస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ తన భుజం తట్టాడని, అప్పుడు తాను ఎంత గొప్పగా అనుభూతి చెందానో తన భుజానికి తెలుసు అంటూ మాట్లాడారు. ఇంతకు మించి తాను ఏమీ కోరుకోవడం లేదని, మోడీ తన భుజం తట్టడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం పై తనకేమీ బాధలేదన్నట్టుగా మాట్లాడారు. బండి సంజయ్ ప్రసంగంలో చాలా సార్లు మోడీ పేరును ప్రస్తావించారు. ప్రసంగం అనంతరం, ప్రధాని మోడీ చప్పట్లు కొడుతూ కనిపించారు.
Also Read: తెలుగులో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. చారిత్రక వరంగల్ అంటూ..!
బండి సంజయ్ తర్వాత ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఆయన కూడా భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అయితే, బండి సంజయ్ కంటే తక్కువ గానే మోడీ పేరు ను ప్రస్తావించారు. ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలకు సమయం కేటాయించారు. అలాగే.. పార్టీని ఏకతాటిమీదికి తెచ్చే లక్ష్యంలో భాగంగా తామంతా కలిసి బీఆర్ఎస్ పై పోరాడుతామని అన్నారు. కిషన్ రెడ్డి ప్రసంగానికీ ప్రధాని మోడీ చప్పట్లు కొట్టి అభినందించారు. కిషన్ రెడ్డి ప్రసంగం చాలా సాఫీ గా సాగిపోయింది.