కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?.. తిరిగి సొంతగూటికి చేరేందుకు రంగం సిద్దమైందా?

By Sumanth Kanukula  |  First Published Oct 23, 2023, 11:12 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 52 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అయితే తొలి జాబితాలో కొందరు సీనియర్ నేతల పేర్లు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 52 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అయితే తొలి జాబితాలో కొందరు సీనియర్ నేతల పేర్లు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వంటి నేతలకు జాబితాలో చోటు లభించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారని, అందుకే ఆయనకు బీజేపీ జాబితాలో చోటు లభించలేదనే ప్రచారం సాగుతంది. 

కోమటిరెడ్డి కుటుంబం చాలా కాలంగా కాంగ్రెస్‌లో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌తో విభేదిస్తూ.. రాజగోపాల్ రెడ్డి గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే జరిగిన మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై, రాష్ట్ర నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. అయితే ఆ ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే వస్తున్నారు. 

Latest Videos

మరోవైపు రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌లో మాదిరిగా  బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కోమటిరెడ్డి అనుచరుల్లో ఉంది. ఈ క్రమంలోనే వారు రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డినే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీ కాంగ్రెస్‌లో చాలా కీలక భూమిక పోషిస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి రాజగోపాల్ రెడ్డి.. అనుచరులు, మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటే.. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే.. మునుగోడు నుంచే పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితే.. ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి భారీ షాక్ అనే చెప్పాలి. 

click me!