మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ వాజేడులో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ సమ్మేళనంపై రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.
ఖమ్మం:మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడులో గురువారంనాడు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఉమ్మి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వాజేడులో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తన స్వగ్రామం నుండి తుమ్మల నాగేశ్వరరావు వాజేడుకు బయలుదేరారు. సుమారు 300 కార్లతో తుమ్మల నాగేశ్వరరావు ఆయన అనుచరులు వాజేడుకు వెళ్లారు. మంత్రిగా ఉన్న సమయంలో వాజేడులో పలు అభివృద్ది కార్యక్రమాలను తుమ్మల నాగేశ్వరరావు చేపట్టారు. ఈ కార్యక్రమాల సింహాలోకనం పేరుతో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతారనేది ఆసక్తి నెలకొంది.
also read:వ్యక్తిగత ఎదుగుల ఓర్వలేకే హత్య: తమ్మినేని కృష్ణయ్య మృతదేహనికి నివాళులర్పించిన తుమ్మల
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఈ స్థానం నుండి గెలుపొందారు. కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డికి ,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీకి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహలు చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యేలకు అదే స్థానం నుండి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ టికెట్లుకేటాయించింది. టీఆర్ఎస్ నాయకత్వంపై మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. పార్టీ మారాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో సాగుతుంది. అయితే తాను మాత్రం టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు చెప్పినట్టుగా సమాచారం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడ టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఈ రెండు వర్గాలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి. 2014 తర్వాత తుమ్మలనాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నామా నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ నుండి నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అప్పటికే ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాకుండా నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది.
ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో భద్రాచలంలో సీఎం కేఃసీఆర్ పర్యటించిన సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కూడ కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహించారు. కానీ ఇవాళ వాజేడులో నిర్వహిస్తున్నఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.