బీజేపీకి మరో షాక్: రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

By narsimha lodeFirst Published Jul 26, 2021, 6:08 PM IST
Highlights


బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేర్చుకొనే సమయంలో తనతో చర్చించలేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా ఆయన పార్టీ నాయకత్వం తీరుపై  అసంతృప్తితో ఉన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆయన ఆశించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం తనతో చర్చించకుండానే ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గత వారంలోనే రాజీనామా చేశారు. 

సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించాడు.2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే అనుహ్యంగా చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో  పెద్దిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

ఈటల రాజేందర్  టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.ఈ విషయమై పార్టీ నాయకత్వం తనతో చర్చించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈటల రాజేందర్  బీజేపీలో చేరడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడ ఆయన దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం కూడ కొంత కాలంగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు.  పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


 

click me!