పోడు భూముల్లో హరితహరం పథకం కింద మొక్కలు నాటొద్దని కోరుతూ రైతులు అటవీశాఖాధికారుల కాళ్లు మొక్కారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లిలో చోటు చేసుకొంది.
మహబూబాబాద్: తాము నమ్ముకొన్న భూముల నుండి తమను వేరు చేయవద్దని రైతులు అటవీశాఖాధికారుల కాళ్లు మొక్కారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం నాడు చోటు చేసుకొంది.జిల్లాలోని గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పోడు భూముల్లో అటవీశాఖాధికారులు హరిత హరం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి ఈ పోడు భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని రైతులు చెప్పారు. తమను ఈ భూమి నుండి విడదీయవద్దని రైతులు కోరారు.
ఇవాళ కూలీల సహయంతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రైతులు అడ్డుకొన్నారు. అటవీశాఖాధికారుల కాళ్లు మొక్కి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే అటవీశాఖాధికారులు రైతుల గోడును పట్టించుకోలేదు. అంతేకాదు రైతులను దూషించారు. అయినా కూడ రైతులు మాత్రం తమకు న్యాయం చేయాలని అధికారులు కాళ్లు పట్టుకొని వేడుకొన్నారు.పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ ఈ సమస్యను పరిష్కరించలేదు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు పరిష్కారం అందిస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారు.