హుజూరాబాద్‌లో పోటీకి కొండా సురేఖ సై: కానీ.. ట్విస్టిచ్చిన మాజీ మంత్రి

By narsimha lodeFirst Published Sep 9, 2021, 3:46 PM IST
Highlights

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను పార్టీ నాయకత్వం కోరుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అయితే తిరిగి తాను వరంగల్ కు తిరిగి వచ్చేందుకు పార్టీ ఒప్పుకొంటే తాను హుజూరాబాద్ లో పోటీకి సిద్దమని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా హుజూరాబాద్ లో పోటీ చేసే అభ్యర్ధిని నిర్ణయించలేదు. 


వరంగల్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. హుజూరాబాద్ లో పోటీ చేసే విషయమై ఆమె తోలిసారిగా స్పందించారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్ధిత్వంపై ఆ పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. టీఆర్ఎస్,బీజేపీలకు ధీటైన అభ్యర్ధిగా కొండా సురేఖ నిలుస్తారని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

also read:హుజూరాబాద్ ఉపఎన్నిక ఆలస్యం: కాంగ్రెస్‌కి కలిసొచ్చిందా?

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీచేయాలని తమ పార్టీ నేతలు కోరుతున్నారని  కొండా సురేఖ తెలిపారు. ఒకవేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తేల్చి చెప్పారు.

 హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి గణనీయమైన ఓట్లే వచ్చాయి. గతంలో వచ్చిన ఓట్లను నిలుపుకొనేందుకు కొండా సురేఖను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపు ఓటర్లు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో కొండా సురేఖ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపుతుందనే ప్రచారం కూడ లేకపోలేదు.

click me!