మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కె. విజయరామారావు సోమవారంనాడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కె. విజయరామారావు గతంలో సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు.
సీబీఐ డైరెక్టర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత విజయరామారావు టీడీపీలో చేరారు. తటస్థులను పార్టీలో చేరాలని అప్పట్లో చంద్రబాబు ఆహ్వానించారు.ఆ సమయంలో విజయరామారావు టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయరామారావు పోటీ చేసి విజయం సాధించారు. మాజీ మంత్రి , కాంగ్రెస్ కీలక నేత పి. జనార్ధన్ రెడ్డిపై విజయరామారావు విజయం సాధించి తొలిసారే అసెంబ్లీలో అడుగు పెట్టారు. చంద్రబాబు మంత్రివర్గంలో విజయరామారావు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయరామారావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
undefined
అనారోగ్యంగా ఉండడంతో విజయరామారావును కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారంనాడు ఆయన కన్నుమూశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోయిన సమయంలో విజయరామారావు హైద్రాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. హవాలా కుంభకోణం , ఇస్రో గూఢచర్యం, ముంబై పేలుళ్ల వంటి కీలక కేసులను సీబీఐ డైరెక్టర్ గా విజయరామారావు దర్యాప్తు చేశారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం
విజయరామారావు మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.