బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం విచారణకు రావాలని ఆ నోటీసులో మహిళా కమిషన్ పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించబోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీసుకుంది. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో కల్వకుంట్ల కవిత ఈ నెల 11న విచారణకు హాజరయ్యారు.ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని కూడా కోరారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ విషయమై మహిళా కమిషన్ నోటీసులు ఇస్తే సమాధానం ఇస్తానని బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్ కు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.ఈ విషయమై డీజీపీ నుండి మహిళా కమిషన్ కు నివేదిక అందింది. ఈ నివేదిక ఆధారంగా మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది.
also read:కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించను.. ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలి: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో బండి సంజయ్ ను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఈ నోటీసులో పేర్కొన్నట్టుగా ఈ నెల 15న విచారణకు హాజరౌతారా మరో రోజున విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కోరుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.