మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఇతరుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు.
హైదరాబాద్: వయస్సు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి సూచించారు. శుక్రవారంనాడు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రజ్ఞపూర్ వద్ద మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుపై ఈటల రాజేందర్ స్పందించారు. ఏది పడితే అది మాట్లాడకూడదని ఆయన చురకలు వేశారు.
జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో ఆయన ఉద్దేశ్యం ఏమిటో ఆయననే అడగాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాను కోరారు.
ప్రజా జీవితంలో ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడకూడదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఇతర గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని ఆయన జితేందర్ రెడ్డికి సూచించారు.ఇతరుల స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని ఆయన జితేందర్ రెడ్డికి హితవు పలికారు.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ బీజేపీలో కలకలం రేపుతోంది. తెలంగాణలోని బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్ మెంట్ కావాలని ట్విట్టర్ లో ఓ వీడియోను జితేందర్ రెడ్డి వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో ఓ జంతువును కాలితో ట్రాక్టర్ ట్రాలీలోకి ఎక్కించే దృశ్యం ఉంది. అయితే ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేశారు జితేందర్ రెడ్డి. ఆ తర్వాత మరోసారి ఈ పోస్టు చేశారు. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నవారిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్టుగా జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. బండి సంజయ్ నాయకత్వాన్ని పార్టీలోని ఎవరు వ్యతిరేకిస్తున్నారనే విషయమై చర్చ సాగుతుంది.
బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకత్వాన్ని ఇటీవల కలిసి కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. బండి సంజయ్ ను తప్పించే అవకాశం లేదని పార్టీ నాయకత్వం చెప్పినట్టుగా సమాచారం.