వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా రుజువు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను ప్రభుత్వం సరఫరా చేయడం లేదన్నారు. ఈ విషయమై రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గురువారంనాడు హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హోం గార్డులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.జీతాలు సరిగ్గా రాక హోం గార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.హోం గార్డులకు వేధింపులు ఎక్కవ అయ్యాయన్నారు.
రోజుకు 900 రూపాయాలతో జీవితాన్ని హోం గార్డు లు కొనసాగిస్తున్నారన్నారు.హోం గార్డులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐదు నెల జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. స్కూల్ ఫీజులపై నియంత్రణ లేదని ఆయన విమర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగ్గా అందించడం లేదని చెప్పారు. హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందడం లేదని చెప్పారు.
కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరమన్నారు.విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టడం తెలంగాణలోనే జరిగిందన్నారు.విద్యార్థులను కొట్టిన తీరును చూసి జడ్జి ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు.కేయూ విద్యార్థులను వీసీ కొట్టించిన తీరును దేశం మొత్తం చూస్తుందన్నారు.విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని ఆయన చెప్పారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.రూ. 25 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఐదేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
రైతులను రుణ విముక్తులను చేసి కొత్త లోన్ లను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లిక్కర్ డ్రా పై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చాలా మందికి లక్కీ డ్రా లో మద్యం షాప్ లు రాలేదని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
భూములు అమ్మి,లిక్కర్ డ్రా ల ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చు కుంటుందని ఆయన విమర్శించారు. అత్మహత్యల్లో తెలంగాణ ముందుందని ఆయన ఎద్దేవా చేశారు. అప్పులలో నెంబర్ వన్,భూములు అమ్ముకోవడం లో నెంబర్ వన్,భూములు అమ్మడంలో నెంబర్ వన్,చిన్న ఉద్యోగులను వేధించడంలో నెంబర్ వన్ అని ఆయన ఆరోపించారు.