
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగే ఆలోచనలో సీపీఐ ఉంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్-సీపీఐల మధ్య పొత్తులకు సంబంధించి తెర వెనక చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీట్ల పంపకంపై చర్చించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు, రాజకీయ పరిస్థితులపై నారాయణ.. కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు.
ఈ భేటీ తర్వాత నారాయణ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అన్నీ అర్థరాత్రి సమయంలోనే జరుగుతాయని..ఇది కూడా అటువంటిదేనని చెప్పారు. కాంగ్రెస్‌తో చర్చలపై స్పందించిన ఆయన.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సీపీఐ భాగమైనందున రాష్ట్రంలో కూడా ఆ వైఖరిని తీసుకోవాలని అనుకుంటామని చెప్పారు. ‘‘కేసీఆర్ బాహాటంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నందున, జాతీయ స్థాయిలో వామపక్షాలు, కాంగ్రెస్‌లు చేతులు కలిపినందున, ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిబింబించాలి. దాని గురించి ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. అయితే అది కార్యరూపం దాల్చాలి’’ అని నారాయణ పేర్కొన్నారు.
అయితే కేసీ వేణుగోపాల్‌తో నారాయణ చర్చలు నేపథ్యంలో.. ఈరోజు సీపీఐ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనున్న సమావేశానికి.. నారాయణ కూడా హాజరుకానున్నారు. కాంగ్రెస్‌తో చర్చలు, సీట్ల షేరింగ్‌కు సంబంధించి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక, అంతకుముందు ఆగస్టు 27న నగరంలోని ఓ హోటల్‌లో సీపీఐ రాష్ట్ర అగ్రనేతలు మాణిక్‌రావు ఠాక్రేతో సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే పొత్తులో భాగంగా మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ నేతలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది.