తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ రంగు మారుతున్నాయి. అటు లేదంటే ఇటూ అనే తరహాలో నేతల తీరు కనిపిస్తోంది. నిన్నటి వరకు ఓ పార్టీలో ఉంటూ.. ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోసిన నేతలు... ఆకస్మికంగా మరుసటి రోజు పార్టీని వీడుతున్నారు. మరో పార్టీలో చేరుతున్నారు. అంతముందుకు తాము కొనసాగిన పార్టీ నేతలను టార్గెట్ చేస్తుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి భంగపాటుకు గురైన నేతలు, పార్టీలో సరైన గుర్తింపు లేని అసంతృప్తి నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి.. కాషాయం కండువా తీసివేసి.. హస్తం గూటికి చేరడం చేరడం చూస్తునే ఉన్నాం. తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ నేత ఎవరు ? అసలు కారణమేంటీ?
తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కమలం పార్టీ వీడి.. కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ దాదాపు టికెట్లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వంశీకి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్. వివేక్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానున్నది. ఇప్పటి వరకూ చెన్నూరు (Chennur) టికెట్ తనకే వస్తుందని భావించిన బోడ జనార్ధన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో భేటీ అయినా ఆయన మంగళవారం నాడు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.
రాజీనామా అనంతరం బోడ జనార్థన్ మాట్లాడుతూ.. ఇటీవల పార్టీలో చేరిన.. అసలు పార్టీలో సభ్యత్వం లేని మాజీ ఎంపీ వివేక్‌ను టిక్కెట్ కేటాయించడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఒకే కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు..? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్‌ను .. ఆ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని ఖచ్చితంగా ఓడిస్తామని జనార్దన్ ఛాలెంజ్ చేశారు.