
పొగడ్తలకు పడని వారు ఎవరూ ఉండరు అన్నది పాతకాలం నాటి సామెత. పొగడ్త అనేది ఏ స్థాయిలో అయినా ఉంటుంది. చిన్నవాళ్ల నుంచి పండు ముసలి వాళ్ల వరకు పొగడ్తలు ఉంటాయి. పొగడ్తలకు పడిపోతూనే ఉంటారు. అయితే పొగడ్తల్లో చాలా రకాలుంటాయి. వాస్తవానికి దగ్గరగా కొన్ని పొగడ్తలు ఉంటాయి. వాస్తవానికి విరుద్ధంగా మరికొన్ని పొగడ్తలు ఉంటాయి.
తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవంచ లక్ష్మారెడ్డి కేసిఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. మామూలు పొగడ్తలు కావు అవి.. ఏకంగా కేసిఆర్ ను దేవుడు అంటూ కీర్తించారు. కేసిఆర్ దయామయుడైన ఏసు క్రీస్తు అంటూ ఆకాశానికి ఎత్తారు. దయామయుడైన ఏసుక్రీస్తు కేసిఆర్ రూపంలో భూమి మీదకు వచ్చి క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మెచ్చుకున్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం క్రిస్టియన్లకు రుణాలు, ఉపకార వేతనాలు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమాలు చేస్తున్నందున సిఎం కేసిఆర్ పై మంత్రి లక్ష్మారెడ్డి దేవుడితో సమానమంటూ పొగడ్తలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలోనూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇదే తరహాలో సిఎం కేసిఆర్ ను దేవుడితో పోలుస్తూ ఆకాశానికి ఎత్తారు. కేసిఆర్ కొమరెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న లాంటి గొప్ప వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపించు. ఈ పొగడ్తలు మాత్రం తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.