
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ కేజీబీవీలోని 70 మంది విద్యార్థులు ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 35 మంది విద్యార్థులు హాస్పిటల్ చేరారు. దీనికి కారణం ఫుడ్ పాయిజన్ అవడమే అని డాక్టర్లు నిర్దారించారు. ఇంత మంది విద్యార్థులు ఒక్క సారిగా అస్వస్థతకు గురవడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ కేజీబీవీ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో కొనసాగుతోంది. ఇది రిమ్స్ హాస్పిటల్ కు కొంచెం దూరంలోనే ఉంది. ఇందులో ఆరో తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్ చదివే పిల్లల వరకు ఉంటారు. అయితే శుక్రవారం రాత్రి భోజనంలో అన్నం, వంకాయ, పంపు తిన్నారు. అయితే అర్ధరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యాయి. ఉదయం మరి కొందరు విద్యార్థులకు కూడా అలాగే జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థులు స్థానికంగా ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాదాపు 35 మంది పిల్లలను రిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులకు కేజీబీవీలోనే క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే స్పందించారు. వెంటనే విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కేజీబీవీని సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు. తాగేందుకు, స్నానం చేసేందుకు అవే నీటిని ఉపయోగిస్తున్నామని పిల్లలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అసవరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఒక్క సారిగా ఇంత పెద్ద మొత్తంలో స్టూడెంట్లు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హాస్పిటల్ కు, స్కూల్ వద్దకు చేరుకున్నారు. అయితే అందరూ క్షేమంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ఈ భీంపూర్ కేజీబీవీ ఘటన మూడోది. దీనికి అధికారుల పర్యవేక్షణ లోపం, అపరిశుభ్ర వాతావరణమే కారణంగా తెలుస్తోంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రూరల్ కేజీబీవీలో స్టూడెంట్లు ఉదయం టిఫిన్ చేసిన తరువాత దాదాపు 46 మంది కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారిని రిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అలాగే ఇదే కేజీబీవీకి చెందిన మరో 16 మంది స్టూడెంట్లు గురువారం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తాంసి మండలంలోని గోట్కూరి స్కూల్ లో స్డూడెంట్లు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ రిమ్స్ కు తరలించారు.
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాసిరకమైన కూరగాయలు, ఇతర వస్తువులతో భోజనం తయారు చేస్తుండటం, వంట చేసే ప్రదేశంలో అపరిశుభ్ర వాతావరణం ఉండటం, అధికారులు పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటను పునారవృతం అవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.