
హైదరాబాద్: ఇవాళ(ఆదివారం) టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (kcr) కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీ ఏర్పాటుచేసిన ఇద్దరు టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసారు. కేవలం ప్లెక్సీ ఏర్పాటుచేసినందుకే పోలీస్ కేసు నమోదు చేస్తారా? అన్న అనుమానం రావచ్చు. కానీ వారు ఏ రోడ్డుపక్కనో, సాధారణ భవనంపైనో ఈ ప్లెక్సీ ఏర్పాటుచేయలేదు... ఏకంగా చారిత్రాత్మక కట్టడం చార్మినార్ (charminar) పై ఎమ్మెల్సీ కవిత ప్లెక్సీని ఏర్పాటుచేసారు. అందుకే వీరిపై కేసు నమోదయ్యింది.
హైదరాబాద్ (hyderabad) పాతబస్తీ మొగల్ పురా డివిజన్ టీఆర్ఎస్ (trs) అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ, మరో నాయకుడు మణికొండ విజయ్ కుమార్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించాలనుకున్నారు. అందరిలాగా కాకుండా కాస్త స్పెషల్ గా కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన నాయకురాలు కవిత ఫోటోతో భారీ ప్లెక్సీని తయారుచేయించారు. ఆ ప్లెక్సీని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ప్రదర్శించారు.
శనివారం రాధాకృష్ణ, విజయ్ చార్మినార్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి కవిత ప్లెక్సీతో ఛార్మినార్ పైకి చేరుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఈ ప్లెక్సీని ఛార్మినార్ పై ప్రదర్శించారు. అయితే ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్లెక్సీని తొలగించారు.
చారిత్రాత్మక కట్టడంపై ఇలా ప్లెక్సీలను ప్రదర్శించడం నిబంధనలకు విరుద్దమని చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి తెలిపారు. అందువల్లే కవిత ప్లెక్సీని ప్రదర్శించిన ఇద్దరు టీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు అధికారపార్టీ నేతలిద్దరిపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చిన్ను గౌడ్ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహాబలేశ్వర ఆలయ సమీపంలో అరేబియా మహాసముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును పురస్కరించుకొని టి.ఆర్.ఎస్.వి రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింత శ్రీకుమార్ రూపొందించిన "జేజేలు కవితక్క" పాట ఆడియో సిడిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు కూడా ఈ సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.