
సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కుండపోత వర్షానికి జనావాసాలు నీట మునిగాయి. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. ఇలా సిరిసిల్ల పట్టణంలో కూడా పలు కాలనీలు నీటమునిగి కొందరు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. అలాంటి వారిని కాపాడేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వయంగా రంగంలోకి దిగారు.
భారీ వర్షాల కారణంగా నీటమునిగిన కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టాలని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీస్ యాంత్రాగానికి సూచించారు. ఇలా కేవలం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాదు స్వయంగా తానే క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. మోకాల్లోతు నీటిలో సిరిసిల్ల లోని పలు కాలనీల్లో పర్యటించిన ఎస్పీ అనేక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తోటి పోలీస్ అధికారులతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, వెంకంపెట్ రోడ్, బి.వై నగర్, సుందరయ్య నగర్, పాత బస్టాండ్ ప్రాంతాలను ఎస్పీ రాహుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఓ గర్భిణీ మహిళ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుసుకుని వెంటనే ఆమెను అక్కడినుండి హాస్పిటల్ కు తరలించారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులకు ఓ జె.సి.బిలో ఎక్కించి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీడియో
ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ... ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న 46 కుటుంబాలను పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని... అనవసరంగా బయటకు రాకూడదన్నారు. సహాయక చర్యలు చేపడుతున్న పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ సూచించారు.
''భారీ వర్షాల కారణంగా ఏవయినా సంఘటనలు జరిగితే మీ పరిధిలోని పోలీసులకు కానీ డయల్ 100 కానీ సమాచారం అందించాలి. వెంటనే పోలీసులు తక్షణ సహాయక, రక్షణ చర్యలు చేపడతారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో టీంలుగా ఏర్పడి కలిసి పని చేస్తున్నాం. ఎవరూ కూడా నీటి ప్రవాహాలు దగ్గరికి ఫోటోలు, సెల్ఫీల కోసం చేపల పట్టడం కోసం వెళ్లకూడదు. అలా వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు'' ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.