హైద్రాబాద్ రాజేంద్రనగర్ ఎర్రబోడకాలనీలో ఐదుగురిపై వీధికుక్కలు దాడి చేశాయి.
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్ గూడ ఎర్రబోడ కాలనీలో ఐదుగురిపై వీధికుక్కలు బుధవారం నాడు దాడి చేశాయి. ఈ దాడితో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను పట్టుకెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
హైద్రాబాద్ ఎర్రబోడ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు బుధవారం నాడు దాడి చేశాయి. ఈ దాడిని అడ్డుకోబోయిన మరో బాలుడిపై కూడా కుక్కలు దాడికి దిగాయి. దీంతో స్థానికులు వెంటనే ఈ విషయాన్ని గమనించి కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నంలో మరో ముగ్గురిపై కూడా కుక్కలు దాడి చేశాయి.
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి చేయి పట్టుకుని కుక్కలు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినవారిపై కుక్కలు దాడికి దిగాయి. మూడు రోజుల క్రితం హైద్రాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు దాడి చేశాయి. ఈ డాదిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిన్న హైద్రాబాద్ నగరంలోని చైతన్యపురి మారుతినగర్ లో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కలను వాహనదారుడు తరిమికొట్టాడు. అప్పటికే కుక్కలు బాలుడి తొడపై గాయం చేశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, ఎస్సీ హస్టల్ లో కుక్కలు దాడి చేశాయి. సుమన్ అనే విద్యార్ధిని గాయపర్చాయి. వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామంలో బైక్ పై వెళ్తున్న యేసయ్యపై దాడికి యత్నించాయి. ఈ ఘటనలో యేసయ్య బైక్ పై నుండి పడి గాయపడ్డాడు.
also read:హైద్రాబాద్‌లో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు: 500 వీధి కుక్కలను పట్టుకున్న జీహెచ్ఎంసీ
వీధికుక్కల అంశంపై ఈ నెల 23వ తేదీన జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. నిన్న అధికారులతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీధి కుక్కలను పట్టుకోవాలని ఆదేశించారు. అంతేకాదు కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కూడా అధికారులను కోరారు. . కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను రక్షణ కల్పించే విషయమై జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. ఈ విషయమై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.